కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి
ఎంజీఎం : కుటుంబ కలహాలతో భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన అత్తామామలపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని వాసవీ కాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వాసవీ కాలనీ చెందిన జన్నుబాబు–అనిత దంపతుల కుమార్తె పల్లవి ఉర్సు ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్‌ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజులు పాటు సాఫీగా సాగిన క్రమంలో గతేడాది నుంచి దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. వీరికి కుమారుడు జన్మించాడు. చంద్రశేఖర్‌తో వివాదం కారణంగా పల్లవి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రెండ్రోజుల క్రితం చంద్రశేఖర్ కొడుకును తీసుకెళ్లడానికి అత్తగారి ఇంటి రాగా భార్య, అత్తామామ నిరాకరించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పల్లవి కొడుకుకు పాలు ఇస్తుండగా చంద్రశేఖర్ కత్తితో వచ్చి నేరుగా భార్య తలపై నరికాడు. ఈ ఘటనలో ఆమె అక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. ఈ సమయంలో అత్తామామలు అడ్డుపడగా వారిపై కూడా దాడి చేసి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కాగా, పల్లవి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్త అనిత, మామ బాబు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు.
● అడ్డొచ్చిన అత్తామామలపై సైతం..
● బాధితులకు ఎంజీఎంలో చికిత్స
● వాసవీ కాలనీలో దారుణం
Comments
Please login to add a commentAdd a comment