నిబంధనలు
బకాయిలు లేవు
డెయిరీ నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ నుంచి రెండు రోజులకు సంబంధించిన అమ్మకాల మొత్తం విలువ రూ.12 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రతీ రోజు 240 ప్రభుత్వ సంస్థలు, సివిల్ మార్కెట్ కలుపుకుని 10వేల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు డిస్ట్రిబ్యూటర్ ఏరోజు చెల్లించాల్సిన డబ్బులను అదే రోజు చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి బకాయిలు లేవు.
– శ్రవణ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్,
విజయ డెయిరీ, వరంగల్
హన్మకొండ చౌరస్తా : ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నిర్వహణపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుని.. పాల అమ్మకాలు పెంచేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వకపోగా.. నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ పాలను ప్రజలకు మరింత చేరువచేసి అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌కు అప్పగించారు. నిబంధనల ప్రకారం వరంగల్ యూనిట్ పరిధిలో రోజుకు 10 వేల లీటర్ల పాల అమ్మకాలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్‌కు డెయిరీ అనుమతులు ఇచ్చింది. అయితే రెండు రోజుల అమ్మకాల మొత్తాన్ని ముందే చెల్లించేలా (కాషన్ డిపాజిట్) రూ.15 లక్షలు చెల్లించాలని షరతులు విధించింది. కాగా, రూ. 15 లక్షలు డిపాజిట్ చేసిన సదరు డిస్ట్రిబ్యూటర్.. నిబంధనల ప్రకారం ఏ రోజు అమ్మకాలకు సంబంధించిన మొత్తం (డబ్బు) చెల్లించాల్సి ఉన్నప్పటికీ తన ఇష్టానుసారంగా చెల్లిస్తూ ప్రస్తుతం డెయిరీ రూ.40 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
డిస్ట్రిబ్యూటర్‌కు అనధికారికంగా సాయం..
డెయిరీకి ఏ రోజు డబ్బులు అదే రోజు చెల్లించాల్సి ఉండగా రోజుల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రోజు చెల్లిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్‌కు అనధికారికంగా డెయిరీ అధికారుల్లో కొందరు సాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంతన లేని లెక్కలు చూపెడుతూ ఉన్నతస్థాయి అధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు డెయిరీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
లాభాలు గడిస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు..
ఒక్కో లీటర్ పై డిస్ట్రిబ్యూటర్‌కు రూ. 8 చెల్లిస్తున్నామని డెయిరీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా రూ.10.50 పైసలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 10వేల లీటర్ల పాలు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లాభాలను గడిస్తున్నప్పటికీ డెయిరీకి చెల్లించాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్‌లో పెడుతూ సంస్థకు నష్టాలు చవిచూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం పై పాడి రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ పాల అమ్మకాలపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు, అవినీతి బయటపడుతుందని పాడిరైతులు పేర్కొంటున్నారు.