
భానుడు
భగ్గుమంటున్న
● పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ఉక్కపోత
● వడదెబ్బకు గురైతే అనారోగ్యమే
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
నెహ్రూసెంటర్: జిల్లాలో రోజురోజుకూ ఎండల తీ వ్రత పెరుగుతోంది. ఉదయం 10గంటల తర్వా త ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణంలో తేమశాతం తగ్గి ఉక్కపోతగా ఉంటుంది. కాగా ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వేసవికాలంలో ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.
నీళ్లతోపాటు పండ్లరసాలు తీసుకుంటే మేలు..
ప్రజలు అత్యవసర పనుల మీదు బయటకు వెళ్లే ముందు నీరుతాగడంతో పాటు వెంట తీసుకెళ్తే మంచిది. పండ్ల రసాలు, సీజనల్ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని, వేసవికాలంలో కూల్‌డ్రింక్స్, మద్యం తాగొద్దని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. హీట్‌వేవ్‌కు గురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాగా ఎండ తీవ్రతతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి...
వేసవికాలంలో పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణులు పలు జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఎండలో ఆటలు ఆడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కాగా బయటకు వెళ్లేముందు పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించడం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు అందించడం ద్వారా ఎండదెబ్బకు గురికాకుండా చూడవచ్చు. అలాగే వృద్ధులు, పిల్లలు తరచూ నీళ్లు తాగాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. గర్భిణులు, బాలింతలు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలి. ముందురోజు వైద్యుడి అపాయింట్‌మెంట్ తీసుకుంటే బెటర్. విశ్రాంతి తీసుకోవడంతో పాటు తాగునీరు, పౌష్టికాహారం తీసుకోవాలి. ఎండదెబ్బకు గురైతే తల్లీబిడ్డకు ఇబ్బందులు ఎదురవుతాయి.
రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. వేసవికాలం ప్రతి ఒక్కరూ ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. పండ్ల రసాలు, పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. – డాక్టర్ నవీన్, ఎండీ
వడదెబ్బకు గురైతే..
వడదెబ్బ తాకడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అనారోగ్యానికి గురవుతారు. దీనివల్ల అధిక శరీర ఉష్ణోగ్రత, తలనొప్పి, గందరగోళం, వికారం, వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు తెలుపుతున్నారు.

భానుడు

భానుడు

భానుడు

భానుడు