కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) సింగని ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్థానికులు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, కోతులు, కుక్కలు బెడద, రిజిస్ట్రేషన్‌తోపాటు పలు సమస్యలను విన్నవించుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఆర్‌ఐ తెలిపారు. కాగా ఫోన్ ఇన్ కార్యక్రమం అనంతరం రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని సిబ్బందితో తొలగించారు.
ప్రశ్న: వీధుల్లో విద్యుత్‌స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్‌స్తంభాలకు లైట్లు ఉన్నా నెలల తరబడి వెలగడం లేదు.
(వీఆర్ యాదవ్ కేసముద్రంస్టేషన్, నిమ్మల సంపత్ కేసముద్రంవిలేజ్, సోమారపు శ్రీరాములు అమీనాపురం, ఆరిద్రపు శ్రీనివాస్ అమీనాపురం, కటకం శంకర్ ధన్నసరి)
మున్సిపల్ ఆర్‌ఐ: నిధుల కొరతతో లైట్లను ఏర్పాటు చేయలేకపోతున్నాం. త్వరలో సమస్య ఉన్న చోట వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తాం.
ప్రశ్న: మా బజారులో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరుమోటారు 3నెలల క్రితం చెడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
(బొల్లోజు రామ్మోహనాచారి, కేసముద్రంవిలేజ్, ట్యాంక్‌బజార్)
మున్సిపల్ ఆర్‌ఐ: బోరు మోటారును బాగు చేయించడం కోసం ప్రయత్నించినా మరమ్మతు పూర్తికాలేదు. దగ్గరలో ఉన్న మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకు నుంచి ప్రత్యేకంగా పైపులైన్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తాం.
ప్రశ్న: మా బజారులో సైడ్‌కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. దోమల తీవ్రతతో ఎక్కువైంది. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది.
(బనిషెట్టి విజయ మార్కెట్ రోడ్డు కేసముద్రం, కె.రాధాకృష్ణ, గూబ సంపత్, కేసముద్రంవిలేజ్, షేక్ ఇమ్రాన్ కేసముద్రంస్టేషన్, బనిషెట్టి సత్యనారాయణ అంబేడ్కర్ సెంటర్ కేసముద్రంస్టేషన్)
మున్సిపల్ ఆర్‌ఐ: మా సిబ్బందిని పంపించి రోడ్లపై ఉన్న చెత్తచెదారాన్ని, సైడ్‌కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తాం. ట్రాక్టర్‌లు రావడం లేదని చెప్పే కాలనీల్లోకి కూడా చెత్త ట్రాక్టర్‌లను పంపిస్తాం.
ప్రశ్న: ఇళ్లు, పంట చేనుల వద్ద కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలకు వింత జబ్బులు వస్తున్నాయి. వాటి బెడద ఎక్కువగా ఉంది. (గుండు దామోదర్ కేసముద్రంవిలేజ్ రైతు)
మున్సిపల్ ఆర్‌ఐ: కుక్కల విషయంపై పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్తాం. కోతుల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: రోడ్ల విస్తరణ, రైల్వేమూడోలైన్ పనుల్లో భాగంగా భారీవాహనాలు నిత్యం ప్రధాన రహదారులపై తిరుగుతుండడంతో దుమ్ము,ధూళి లేవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది.
(గుతుప రమేశ్, రామడుగు ధర్మాచారి కేసముద్రంవిలేజ్)
మున్సిపల్ ఆర్‌ఐ: మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ నుంచి అమీనాపురం వరకు, ఉప్పరపల్లి రోడ్డు వైపు రోడ్లపైన దుమ్ము, ధూళి లేవకుండా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీళ్లు చల్లిస్తాం.
ప్రశ్న: మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్‌లు కావడంలేదు. రిజిస్టేషన్‌లు చేయించుకున్న వారిపేర్లు జీపీ రికార్డులో నమోదు కాలేదు. (శ్యామేల్ కేసముద్రంస్టేషన్,
తుమికి శ్రీదేవి లక్ష్మీనగర్ కేసముద్రంస్టేషన్)
మున్సిపల్ ఆర్‌ఐ: మున్సిపల్ డాటా కనిపించకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. హైదరాబాద్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో డాటా మొత్తం అప్రూవల్ చేశాక,సమస్య పరిష్కారం అవుతుంది. త్వరలోనే రిజిస్టేషన్లు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై దృష్టి
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపల్ ఇన్‌చార్జ్ ఆర్‌ఐ ప్రభాకర్
సమస్యలు పరిష్కరిస్తాం..