● జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
ఖిలా వరంగల్: రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జరిగే రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) మేళా బుధవారం రెండు రోజు కొనసాగింది. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని స్టాళ్లను తిలకించారు. మేళాలో సేంద్రియ సాగు, విత్తనాలు, పంట సాగు, యాంత్రీకరణ సాగు, ఉద్యాన పంటలు, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. నూతన పనిముట్లను రైతులకు పరిచయం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. రైతులు ఆధునిక సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, యంత్రీకరణ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి(డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్) రమన్ సింగ్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, నాబార్డు ఏజీఎం రవి, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వరంగల్ చీఫ్ మేనేజర్లు గిరిబాబు, శివప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, కేవీకే శాస్త్రవేత్తలు సాయి కిరణ్, సౌమ్య, జన్యు శాస్త్రవేత్తలు వెంకన్న, సంధ్య కిశోర్, సంగీతలక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.