కొత్తగూడ: ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం గెరిల్లా పోరాట పంథాను ఎంచుకున్న ఉద్యమ సహచరుడు, తన భర్త కుంజ రాము అసువులు బాసాడని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాము స్వగ్రామం మండలంలోని మోకాళ్లపల్లిలో నిర్వహించిన ఆయన 20వ వర్ధంతి సభలో మంత్రి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సమాజం విద్య, వైద్యం, అభివృద్ధికి దూరం అవుతున్నారని, వాటిని గెరిల్లా ఉద్యమాల ద్వారా సాధించుకోవాలనే లక్ష్యంతో ఆదివాసీ లిబరేషన్ టైగర్ స్థాపించి ఆదివాసీలను చైతన్యం చేస్తూ అజ్ఞాత జీవితం గడిపిన రాము స్మరించుకోవడం ప్రతీ ఆదివాసీ బిడ్డ కర్తవ్యమన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే కలిసి ఉద్యమాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి తమ వంతుగా ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి వైపునకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.
కన్నీరు పెట్టుకున్న మంత్రి..
అజ్ఞాత ఉద్యమంలో సహచరుడు, తన భర్త కుంజ రాము వర్ధంతి సభలో స్మృతులను తలచుకుని మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. సీతక్కను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఓదార్చారు. అనంతరం రాము స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి, రాము జీవితంపై రచించిన పాటల సీడీలను ఆవిష్కరించారు.
ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేద్దాం : కుంజ సూర్య
ఆదివాసీల విద్య, ఉద్యోగం కోసం తన సంపాదనలో 20 శాతం కేటాయిస్తానని మంత్రి తనయుడు కుంజ సూర్య ప్రకటించారు. తన తండ్రి ఆశయాలు నెరవేరాలంటే ఉన్నత ఉద్యోగాల్లో ఆదివాసీలు రావాలని అభిప్రాయపడ్డారు. అందుకు కావాల్సిన కోచింగ్‌తో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక సంస్థను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈసభకు కుంజ శ్రీను అధ్యక్షత వహించగా తుడుందెబ్బ నాయకులు రమణాల లక్ష్మయ్య, వట్టం ఉపేందర్, ఆగబోయిన రవి, పోడెం బాబు, రచయిత యోచన, నాయకులు స్వామి, యాకయ్య, ముంజాల భిక్షపతి, మాజీ దళ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఉద్యమ సహచరుడిని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న మంత్రి
మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభ
ఆదివాసీల కోసం అసువులు బాసిన రాము