డోర్నకల్ : డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వలస కూలీ అస్వస్థతకు గురై ప్రాణం కోల్పోయా డు. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడెం ప్రాంతానికి చెందిన కొంతమంది కూలీలు వారం క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూడూరుపాడు ప్రాంతంలో మిర్చి ఏరేందుకు వచ్చారు. దుబ్బగూడెం ప్రాంతానికే చెందిన మడై సుపరి (30), బీంబాయి దంపతులు తమ ఏడాదిన్నర పాపతో గూడూరుపాడు సమీపంలో ఉన్న తమ బంధువుల వద్దకు రావడానికి గురువారం ఆదిలాబాద్ నుంచి డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుపరి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో టికెట్ బుకింగ్ కార్యాలయం సమీపంలో కూర్చున్న చోటే ప్రాణం కోల్పోయాడు. మృతదేహం పక్కన అతడి భార్య బీంబాయి తన చంటిపాపతో గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలిచివేసింది. గూడూరుపాడు నుంచి బంధువులతో పాటు రైతులు వచ్చి మృతదేహాన్ని ప్రైవేట్ వాహనంలో సొంత గ్రామానికి తరలించారు.
అస్వస్థతతో వలస కూలీ మృతి
డోర్నకల్‌లో ఘటన