
రాజయోగమా..అవమానమా!
నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలపై ఆశావహుల దృష్టి
సాక్షి, మహబూబాబాద్: తెలుగు ప్రజలు రాబోయే ఏడాది చేసే పనులకు ఉగాదితో అంకుర్పాణ అవుతుంది. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో తమ భవిత ఎలా ఉంటుందోనని నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం రోజు పంచాంగం చూపించుకొని పనులు మొదలు పెడతారు. ఆదాయం, ఖర్చు.. అవమానం, రాజయోగం మొదలైన అంశాలకు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న తెలుగు సంవత్సరం ఈ ఏడాది రాజకీయ నాయకుల భవితకు కూడా కీలకంగానే ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవులకోసం ఎదురుచూస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ నాయకులకు ఈ ఏడాదిలో తమ భవితవ్యం తేలనుంది. రాజయోగం (పదవియోగం)పై ఎవరి ధీమా వారికి ఉన్నా.. నూతన తెలుగు సంవత్సరం ‘శ్రీ విశ్వావసు’ నామ సంవత్సరంపై విశ్వాసంతో అడుగు పెడుతున్నారు.
నామినేటెడ్ పదవుల ఆశ
ప్రతీసారి నామినేటెడ్ పదవుల కేటాయింపులో చర్చకు వచ్చే మహబూబాబాద్ కాంగ్రెస్ నాయకులకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి దూరం అవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీల్లో జిల్లాకు చెందిన సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు చర్చ జరిగినా.. చివరి నిమిషంలో దూరమైంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ తర్వాత కొత్త తెలుగు సంవత్సరంలో నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పడంతో జిల్లా నుంచి ఎవరికి అవకాశం వస్తుందోనని చర్చ మొదలైంది. లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి రావడంతో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వర్గీయుల్లో ఆశలు కలిగాయి. అయితే మంత్రి పదవి మిస్సైతే.. రాంచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న భరత్ చందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చివరి వరకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. అయితే రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేషన్ వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. లేకపోతే అదే డీసీసీ భరత్ చందర్ రెడ్డికే ఉంటుందనే చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మరో నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డికి గతంలో నామినేటెడ్ పదవుల కేటాయింపులోనే వస్తుందని అనుకున్నా.. తీరా చూస్తే ఆయన పేరు లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లోనే మకాం వేసి సీఎం సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం. దీంతో శ్రీకాంత్ రెడ్డికి నామినేటెడ్ లేదా పార్టీలోని కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ. వీరితోపాటు ఇప్పటికే గిరిజన ఫైనాన్స్ చైర్మన్‌గా ఉన్న బెల్లయ్య నాయక్, డైరెక్టర్‌గా ఉన్న నెహ్రునాయక్‌లు ఆ పదవితో తృప్తి పడటం లేదని, ఈ సారి అంతకన్న మంచి పదవి వస్తుందని అనుకుంటున్నారు.
ఈ ఏడాదిలోనే స్థానిక సమరం..
ఉగాదితో మొదలయ్యే శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుల గెలుపోటములను తేల్చే ఏడాది. త్వరలో జరిగే వార్డు సభ్యుల ఎంపిక నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ పట్టణంతోపాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల పాలక మండలి ఎన్నికలు కూడా కొత్త సంవత్సరంలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులు ఈ ఏడాదిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని పార్టీ పెద్దలకు చెబుతూ.. గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. చావు, బతుకులు, పెళ్లిళ్లు, పేరంటాల్లో అనుచరులతో పాల్గొంటున్నారు. ఉగాది రోజు తమ పేరు బలం చూపించుకొని కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అనుచరులతో చెబుతూ సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాది రాజకీయ ఆశావహులకు కీలక నామ సంవత్సరంగా మారనుంది.
రాజకీయ భవితం తేల్చే
కొత్త సంవత్సరం
శ్రీవిశ్వావసు నామ సంవత్సరంపై
విశ్వాసం