
భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రులు ప్రారంభం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఆదివారం వసంత నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు నిర్వహించడానికి అనుజ్ఞాప్రార్థన, పూర్ణాభిషేకం చేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. లక్ష గులాబీ పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉగాది పర్వదినం కావడంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకున్నారు. సాయంత్రం అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. దేవాలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమ్మవారిని దర్శించిన మంత్రి కొండా సురేఖ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ శేషుభారతి చిత్రపటాన్ని బహూకరించారు.

భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రులు ప్రారంభం