
ఇసుక అక్రమ రవాణా
● ఆరు ట్రాక్టర్ల సీజ్, కేసు నమోదు
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఇసుకాసురులు అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉగాది పండగ రోజున వాగు నుంచి ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యాన సిబ్బందితో రంగంలోకి దిగారు. బ్రాహ్మణకొత్తపల్లి శివారులో ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారులను చూసి యజమానులు, డ్రైవర్లు వాగులోనే వాహనాలను వదిలి పారిపోయారు. దీంతో తహసీల్దార్ రాజు స్వయంగా డ్రైవర్ అవతారమెత్తారు. సిబ్బందితో కలిసి వాగు నుంచి ఆరు ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించి సీజ్‌చేసి కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు పంపించారు.