
ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో కృష్ణవేణి ప్రతిభ
స్టేషన్‌ఘన్‌పూర్: ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి ప్రతిభ చాటింది. ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు కాంబోడియా రాజధాని పీనంపెన్‌లో జరిగిన మొదటి ఏషియన్ పారాత్రోబాల్ పోటీల్లో ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించింది. ఈ పోటీల్లో మొత్తం 8 దేశాలు పాల్గొనగా.. ఇండియా కాంస్య పతకం సాధించింది. భారత జట్టులో కృష్ణవేణి ప్రతిభ చాటింది. కాగా, గత డిసెంబర్ 4,5,6వ తేదీల్లో కాంబోడియాలో జరిగిన సిట్టింగ్ పారాత్రోబాల్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న కృష్ణవేణి అత్యుత్తమ ప్రతిభతో గోల్డ్‌మెడల్ సాధించింది. ప్రస్తుతం జరిగిన మొదటి ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ చాటడంతో ఇండియా జట్టు కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారాత్రోబాల్ క్రీడల అధ్యక్షుడు వీయాన్‌సన్ చేతుల మీదుగా పతకం అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏషియన్ పారాత్రోబాల్ పోటీల్లో ప్రతిభ చూపడం సంతోషంగా ఉందని, సహకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు కృష్ణవేణికి అభినందనలు తెలిపారు.