
ఉద్యోగ విరమణ సహజం: డీఎంహెచ్‌ఓ
తొర్రూరు: అంకితభావంతో విధులు నిర్వహిస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తెలిపారు. జిల్లా వైద్యాధికారిగా పని చేసి పదవీ విరమణ పొందిన గుండాల మురళీధర్‌ను శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదవీ విరమణ సహజమేనని, తదనంతరం సామాజిక సేవా కార్యక్రమాలు ఆరంభించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో జిల్లాలోని పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు మురళీధర్ కృషి చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్‌రావు, వైద్యులు జ్వలిత, నందన, మీరాజ్, ప్రియాంక, ప్రసాద్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, సిబ్బంది పురుషోత్తం, కేవీ రాజు పాల్గొన్నారు.