
నెల రోజుల్లో ‘కిటెక్స్’ ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లోని కేరళ కేంద్రంగా ఉన్న ‘కిటెక్స్’ కంపెనీని నెల రోజుల్లో ప్రారంభిస్తామని మేనేజర్ మనోజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కంపెనీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్ మనోజ్.. కలెక్టర్, ఎమ్మెల్యేకు కంపెనీలో తయారు చేసే గార్మెంట్లు, ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, వచ్చే నెలలో ప్రధాని మోదీతో కంపెనీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, కంపెనీలో ఇప్పటికే పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల భర్తీ ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ నిరుద్యోగులు కంపెనీ వద్దకు దరఖాస్తులతో క్యూ కడుతున్నారు. టీజీ ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, గీసుకొండ తహసీల్దార్ ఎండి. రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
20న హజ్ యాత్రికులకు శిక్షణ
న్యూశాయంపేట : పవిత్ర మక్కాలోని హజ్ యాత్రకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా యాత్రికులకు ఈనెల 20 ఆదివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్‌మోహియోద్దీన్ ఘాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ ఎల్‌బీ నగర్‌లోని ఏ1 ఫంక్షన్‌హాల్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రొజెక్టర్ ద్వారా సవివరంగా యాత్ర ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ అందిస్తారన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రూపాషా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాత్రీకులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
● కంపెనీ మేనేజర్ మనోజ్
● పనుల పురోగతిని పరిశీలించిన
కలెక్టర్, ఎమ్మెల్యేకు వివరించిన మేనేజర్