
బాధ్యతాయుతంగా పనిచేయాలి
మహబూబాబాద్ రూరల్: పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని, క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘాపెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం లేనప్పటికీ, సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అయ్యే అవకాశం ఉందని, ప్రత్యేక నిఘా పెట్టి రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు. అందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాల ని సూచించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్సులను ఏర్పాటుచేసి తనిఖీలు చేయాలని, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామం, మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఏర్పాటు చేసిన చోట పనిచేయని వాటిని పునరుద్ధరించడం లేదా కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకా లు అందించారు. డీఎస్పీలు తిరుపతిరావు, డీఎస్పీ కృష్ణకిశోర్, డీసీఆర్బీ డీఎస్పీ మోహన్, సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్