
నిరంతరం కష్టపడితేనే విజయం
కేయూ క్యాంపస్ : నిరంతరం కష్టపడితేనే విజయం వరిస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో గురువారం యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన యూనివర్సిటీ కాలేజీ వార్షిక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేలో వీసీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టించే తత్త్వం, పట్టుదల, అకడమిక్‌పై పట్టు, పెద్ద లక్ష్యం, జీవన నైపుణ్యాలు విజయమార్గాన్ని సుగమం చేస్తాయన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థి దశలో అవసరమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ సినీ గేయ రచయత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ విద్యార్థులతోనే సమాజ మార్పు సాధ్యమన్నారు. రైతులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల కృతజ్ఞతభావం ఉండాలన్నారు. మరో గౌరవ అతిథి, ఇండియన్ కబడ్డీ టీం పూర్వపు హెడ్ కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదువుకు టాలెంట్‌కు సంబంధం లేదు అన్నారు. చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి. సురేశ్ లాల్, ఎన్. సుదర్శన్, బి. రమ, బి. సుకుమారి, ఎం.నవీన్, చిర్రరాజు, కె. అనితారెడ్డి, పుల్లూరి సుధాకర్, కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, క్యాంపస్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మమత వందన సమర్పణ గావించారు.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి