
దంపతుల ఆత్మహత్యాయత్నం
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని దానవాయిపేట గ్రామానికి చెందిన దంపతులు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం దానవాయిపేటకు చెందిన భార్యభర్తలు ఇందు, రవి ఐదు రోజులుగా గొడవ పడుతున్నారు. కాగా శనివారం ఉదయం ఇద్దరు గొడవకు దిగడంతో భర్త రవి బయటకు వెళ్లిపోయాడు. భర్త బయటికి వెళ్లిన క్రమంలో భార్య ఇందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అత్మహత్యా యత్నానికి పాల్పడింది. బయటికి వెళ్లిన భర్త రవి ఇంటికి రాగానే భార్య ఇందు పురుగుల మందు తాగిందనే విషయం తెలుసుకొని అతను కూడా పురుగుల మందు తాగి అత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంకటాపురం వైద్యశాలకు తరలించి చిక్సిత అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు తెలియదు.
టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం
● ధ్వంసమైన టోల్ క్యాబిన్..
సిబ్బందికి గాయాలు
● పోలీసుల అదుపులో లారీ డ్రైవర్
రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాతీయ రహదారిపై కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద శనివారం లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ సరాసరి టోల్‌ప్లాజా క్యాబిన్‌లో దూసుకెళ్లాడు. దీంతో క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది ఒకరు గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన లారీ డ్రైవర్ మక్కల శంకర్ హైదరాబాద్ నుంచి లారీతో హనుమకొండకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద రెండో నంబర్ క్యాబిన్‌లోకి లారీతో దూసుకెళ్లగా, క్యాబిన్ ధ్వంసమైంది. విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బంది బండి శ్రీనాథ్‌గౌడ్ గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టగా దెబ్బతింది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ శంకర్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లు తేలిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. నరేష్ తెలిపారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతుల ఆత్మహత్యాయత్నం