
రజతోత్సవ సభనుంచే కాంగ్రెస్ పతనం
ఎల్కతుర్తి : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీ పతనం రజతోత్సవ సభ నుంచే ప్రారంభం కాబోతుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీష్‌కుమార్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న తదితరులతో కలిసి సభా స్థలిని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలోనే దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని ఆయన విమర్శించారు. ఏడాదిన్నర తిరగక ముందే కాంగ్రెస్‌కు ప్రజలే తద్దినం పెట్టే రోజులు దగ్గర పడ్డాయని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రజతోత్సవ సభ ప్రభుత్వ వ్యతిరేక సభగా మారనుందని తెలిపారు. గతంలో వరంగల్‌లో నిర్వహించిన సభలు రికార్డులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందని, అదే తరహాలో ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ రికార్డు సృష్టించబోతుందన్నారు. కేసీఆర్ మాటలు వినాలే..కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కుతూహలంతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ సభద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అంతకు ముందు మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి