
విద్య మాఫియాను అడ్డుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: కార్పొరేట్ విద్య మాఫియాను అడ్డుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్‌లో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొంతుకై నిలబడి వారి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వానికి పలు సూచనలు చేసి విద్యా వ్యవస్థ పటిష్టానికి సహకరిస్తామన్నారు. ఏపార్టీకి అనుబంధంగా ఉండకుండా ఉపాధ్యాయ సంక్షేమమే ఎజెండాగా, ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని, కాంట్రిబ్యూషన్‌తో నూతన హెల్త్‌కార్డులు, ప్రతీ సంవత్సరం మేలో బదిలీలు. పదోన్నతులు నిర్వహిస్తామన్నారు. కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాల, మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు టైంస్కేల్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశాల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ అధ్యాపకులకు హెల్త్ కార్డులు అందిస్తామని, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్, ఖమ్మం, హనుమకొండ, మానుకోట జిల్లా అధ్యక్షులు సంకా బద్రీనారాయణ, మిర్యాల సతీశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వైవీరావు, వివిధ సంఘాల అధ్యక్షులు వడ్డెబోయిన శ్రీనివాస్, శ్రీధర్‌రావు, యాకయ్య, రఫీ, నాగిరెడ్డి, ఏఐఎఫ్‌టీఓ ఉపాధ్యక్షులు గీత, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు హల్యానాయక్, రాంజీనాయక్, చిట్టిబాబు, సుజాత, నాగరాజు, కనకయ్య, వెంకన్న, పూర్ణచందర్, సునీత, సంగీత, మమత, సుశీల తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, నల్లగొండ,
ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి