
పోస్టుమార్టం గది ప్రారంభమెప్పుడో?
గార్ల: గార్ల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (సీహెచ్‌సీ)లో నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం పూర్తయి 8నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రారంభించక పోవడంతో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. సీహెచ్‌సీ వైద్యులు మాత్రం సరిపడా సిబ్బంది ఉన్నా ప్రమాదవశాత్తు చనిపోయిన, పురుగుమందు తాగి మృతిచెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. దీంతో మృతదేహాల పోస్ట్‌మార్టం కోసం నిరుపేదలు రూ.10,000 ఖర్చు పెట్టుకొని వాహనం మాట్లాడుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గార్లలో 6ఏళ్ల క్రితం సకల సౌకర్యాలతో నాటి ప్రభుత్వం రూ.5కోట్లు వెచ్చించి 30పడకల ఆస్పత్రిని నిర్మించింది. కాని ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం భవనంను విస్మరించింది. దీంతో మండలంలోని వామపక్ష పార్టీల నాయకులు సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం భవనం నిర్మించాలని పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ఎట్టకేలకు ఆస్పత్రి వెనుకభాగంలో ప్రభుత్వం 8నెలల క్రితం నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం చేపట్టింది. కాని ఈ పోస్ట్‌మార్టం భవనంలో రైలు, రోడ్డు ప్రమాదాలు, పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న మృతదేహాలకు సీహెచ్‌సీ వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఆసక్తి కనబర్చడం లేదు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తే సాక్ష్యం కోసం మాటిమాటికి వైద్యులు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని, మనకెందుకు రిస్క్ అని వైద్యులు తప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా కలెక్టర్, జిల్లా డీసీహెచ్‌ఎస్ స్పందించి సకల సౌకర్యాలు ఉన్న స్థానిక సీహెచ్‌సీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు డిమాండ్ చేశారు.
ఆర్థికంగా నష్టపోతున్నారు..
గార్ల సీహెచ్‌సీలో వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం లేదు. వైద్యులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వలన, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను రూ.10వేలు ఖర్చు పెట్టి వ్యాన్ తీసుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్తూ నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కలెక్టర్ స్పందించి సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
– ఇమ్మడి గోవింద్, గోపాలపురం
నిర్మాణం పూర్తయి 8నెలలు..
మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి
తీసుకెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్న పేదలు
ప్రారంభించాలని కోరుతున్న ప్రజలు

పోస్టుమార్టం గది ప్రారంభమెప్పుడో?