
‘భూ భారతి’తో విప్లవాత్మక మార్పులు
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
గూడూరు: భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మండలంలోని భూపతిపేట రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, దీంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఆధార్ లింకు ద్వారా భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా సీతానగరం గ్రామంలో నెలకొన్న రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వగా, అవసరమైతే తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మంచారి, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, డీఏఓ విజయనిర్మల, నెక్కొండ ఏఎంసీ వైస్ చైర్మన్ నరేష్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.