
కాంగ్రెస్ ఇక ఖతమే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మోసాలు, తీర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పని ఇక ఖతమైనట్లే, ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ఆదాయం పడిపోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏమీ చేయలేని ప్రభుత్వంపై ఏడాది న్నర కాలంలోనే ప్రజలు మండిపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. సరిపడ నీళ్లున్నా.. పంటలు ఎండిపోయాయని, రైతులను నిండాముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఎల్కతుర్తిలో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రగా బయలుదేరారని, కేసీఆర్‌ను చూడాలని, ఆయన మాటలు వినాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలంటే తెలంగాణ ప్రజలకు పండుగలాంటిదన్నారు. 14 ఏళ్ల ఉద్యమంలో ఉన్నా.. పదేళ్లు పరిపాలనలో ఉన్నా.. ఏడాదిన్నరగా ప్రతిపక్షంలో ఉన్నా.. బీఆర్‌ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమేనన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎల్కతుర్తి కేంద్రంగా నిర్వహించే రైతుసభకు లక్షలాదిగా జనం తరలివస్తారని అంచనాలు తేలిపోతున్నాయని, కానీ ట్రాఫిక్ నియంత్రణ పేరిట ఈ ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉందని, నాయకులు, కార్యకర్తలు స్వీయ నియంత్రణ చేపట్టి అధిక సంఖ్యలో సభకు తరలివచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్‌కుమార్, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రజతోత్సవ సభ చరిత్రాత్మకంగా నిలుస్తుంది
ఎల్కతుర్తి: రజతోత్సవసభ చరిత్రాత్మకంగా నిలు స్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. చింతలపల్లి సమీపంలో సభా ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అప్పటి కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రాన్ని సీఎంగా కేసీఆర్ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. నాయకులు పిట్టల మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామి, వేముల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ మోసాలు ప్రజలకు
తెలిసిపోయినయ్..
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు