వదంతులు సృష్టించొద్దు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: అన్ని పండగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతపరమైన వదంతులు, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసులు, మత పెద్దలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. యువత మత విద్వేషాలకు గురి కాకుండా ఉండడానికి సరైన మార్గనిర్దేశం చేయడం అవసరమన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కోసం ప్రతి మత పెద్దలు, వారివారి అనుచరులను సహనంతో ప్రవర్తించే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని సుదర్శన్ గార్డెన్‌లో గురువారం రాత్రి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతిని రెచ్చగొట్టే వదంతులపై కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, గాంధీనాయక్, అప్పయ్య, ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, ఎస్‌బీ సీఐ వెంకటేష్, వివిధ మతాల పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment