ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి కార్య క్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు అందాయి. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ. విద్యుత్ , తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. మండలంలో గ్రామాలు, హ్యాబిటేషన్‌లలో విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్య లేకుండా వేసవి ముగిసే వరకు పర్యవేక్షించాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతులు, అత్యవసర పనులకు నిధులు అవసరం ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్ ద్రావణంతో పాటు తాగు నీటి వసతి, టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఐసీడీఎస్, ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ను సంప్రదించి సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ వడ దెబ్బ కారణాలు, నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, డీపీఓ పార్థసారథి, జిల్లా సంక్షేమ అధికారిణి, జరీనా బేగం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్, తాగునీటి సమస్య లేకుండా చూడాలి
కలెక్టర్ విజయేందిర బోయి
Comments
Please login to add a commentAdd a comment