నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి నిఘా నీడలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంటర్మీడియట్ అఽధికారులు సోమవారం ఉదయం నుంచి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేసి, వసతులు, విద్యుత్, తాగునీరు, బెంచీలు, సీసీ కెమెరాలు, ఇతర వసతులపై పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. కొన్ని కేంద్రాల్లో తక్కువ బెంచీలు ఉండడంతో వెంటనే ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని కౌసర్ జహాన్ ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఇటీవల జిల్లాకు చేరుకున్న పలు సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాలను జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ పాయింట్‌లో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. ఆదివారం సాయంత్రం మండలస్థాయి స్ట్రాంగ్ పాయింట్లకు ప్రశ్నపత్రాలను పంపించారు. వీటిని సబ్జెక్టుల వారీగా బుధవారం ఉదయం సంబంధిత పరీక్ష కేంద్రాలను తరలించనున్నారు. ప్రతి కేంద్రంలో మూడు నుంచి ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని నేరుగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
గతంలో హాల్‌టికెట్‌లు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచేవారు. వీటిని ప్రిన్సిపాల్ సంతకం చేసి ఇచ్చేవారు. హాల్‌టికెట్‌లు ఇచ్చే క్రమంలో యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం హాట్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ప్రతి విద్యార్థి tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు పొందుపరిస్తే నేరుగా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ అవుతుంది. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్, ఏ అధికారి సంతకం లేకుండా నేరుగా పరీక్ష కేంద్రంలోనికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి. డబ్బులు ఇస్తేనే హాల్‌టికెట్‌లు ఇస్తామని పలువురు యాజమాన్యాలు అడిగినట్లు కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. హాల్‌టికెట్‌ల కోసం ఇబ్బందులు పడకుండా నేరుగా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిపై కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఎవరి సంతకం అవసరం ఉండదు. ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. – కౌసర్ జహాన్, డీఐఈఓ
ప్రతి కేంద్రంలో 3 నుంచి 5 సీసీ కెమెరాల ఏర్పాటు
వసతులను పరిశీలించిన అధికారులు
హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment