బీసీ కులగణన సర్వే తప్పుల తడక | - | Sakshi
Sakshi News home page

బీసీ కులగణన సర్వే తప్పుల తడక

Published Sat, Mar 1 2025 8:02 AM | Last Updated on Sat, Mar 1 2025 7:58 AM

బీసీ కులగణన సర్వే తప్పుల తడక

బీసీ కులగణన సర్వే తప్పుల తడక

నాగర్‌కర్నూల్‌/ కొల్లాపూర్‌: ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించలేదని ఓ పక్క అందరూ గగ్గోలు పెడుతుంటే.. ఉన్న మంత్రులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే జిల్లాకేంద్రంలో బీసీ సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 8 మంది ప్రాణాలు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ దూత వచ్చారని మంత్రులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఒక్క మంత్రి కూడా సంఘటనా స్థలం వద్ద లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్‌ నాయకులకు లెక్కలేనితనమో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందన్నారు. 2014లో కేసీఆర్‌ జరిపిన సర్వేలో 52 శాతం బీసీలు ఉంటే కాంగ్రెస్‌ సర్వేలో 46 శాతానికి తగ్గిందన్నారు. తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ చూపిస్తోందని విమర్శించారు. రెండోసారి బీసీ కులగణన చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దీనిపై ఎక్కడా ప్రచారం నిర్వహించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వమళ్లీ అదే సర్వే రిపోర్ట్‌ను చూపించి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లు కల్పించేలా వేర్వేరు బిల్లులు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న నాయకులను, అధికారులను ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ‘ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్‌నగర్‌ నుంచే చెబుతున్నా.. కచ్చితంగా పింక్‌ బుక్‌ మెయింటైన్‌ చేస్తాం. మాకు కూడా టైం వస్తది. అప్పుడు అందరి సంగతి చెబుతాం.’ అని కవిత హెచ్చరించారు.

బోనస్‌ పేరుతో బోగస్‌ హామీ..

రైతులకు సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ చేసిందని, రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదని కవిత అన్నారు. కేఎల్‌ఐ పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే అని, పాలమూరు– రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కేసీఆర్‌ హయాంలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం నార్లాపూర్‌ వద్ద పంప్‌హౌజ్‌ను కూడా ప్రారంభించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా నీళ్లు ఇవ్వాలనుకుంటే 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు. గత 15 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని దుయ్యబట్టారు. తక్షణమే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం బీసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు బీసీ గణనపై వెల్లిడించిన అభిప్రాయాలను, సలహాలను ఆమె నోట్‌ చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బైకాని శ్రీనివాస్‌యాదవ్‌, అభిలాష్‌రావు, రఘువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం రాలేదని గగ్గోలు పెడుతుంటే ఉన్న మంత్రులూ వెళ్లిపోయారు

పింక్‌ బుక్‌ మెయింటైన్‌ చేస్తాం.. మాకూ టైం వస్తది

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement