అనుమానాస్పదంగా చిన్నారి మృతి
మల్దకల్ : అనుమానాస్పదంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలోని మద్దెలబండలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నందికర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పవిత్ర, నరేష్ దంపతుల 13నెలల కుమార్తె దర్శినిని ఈనెల 27న ఇంట్లోని ఉయ్యాలలో పడుకోబెట్టి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంటి దగ్గర ఉన్న నాయనమ్మ చిన్నారికి ఆహారం అందించి నిద్రపుచ్చింది. మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంటికొచ్చిన తల్లి పవిత్ర చిన్నారిని చూడగా అచేతన స్థితిలో కనిపించింది. కుటుంబ సభ్యులు దర్శినిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
గోపాల్‌పేట: అప్పులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతిచెందిన ఘటన మండల కేంద్రంలోని హనుమాండ్లగడ్డ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ దామోదర్‌రెడ్డి కథనం మేరకు.. హనుమాండ్లగడ్డకాలనీకి చెందిన మల్లయ్య (40)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉండగా.. అప్పులు, కుటుంబ కలహాలతో కొంతకాలంగా మలయ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నా డు. కాసేపటి తర్వాత తమ్ముడు శివ గుర్తించి తలుపులు బద్దలుగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. భార్య కొంకలి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్‌ఐ వివరించారు.
నిందితుడికి
మూడేళ్ల జైలుశిక్ష
దేవరకద్ర: హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ సబ్ కోర్టు న్యాయమూర్తి గాండ్ల రాధిక తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో ముత్యాలంపల్లిలో శ్రీనివాస్‌పై మురళీధర్‌రావు కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో నేరం రుజువు కావడంతో మురళీధర్‌రావుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
చెట్టుకు ఉరేసుకొని
వ్యక్తి ఆత్మహత్య
ఉప్పునుంతల: మండలంలోని పెనిమిళ్లకు చెందిన మేర కృష్ణయ్య (48) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం తాడూరు శివారులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కృష్ణయ్య భార్య అంజనమ్మ, పిల్లలతో విడిపోయి 20 ఏళ్లుగా తన చెల్లెలు తాడూరుకు చెందిన సాకేవల చంద్రకళ వద్ద ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని బొడ్డుపల్లి చంద్రయ్య వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కన్పించాడు. గమనించిన పరిసర పొలాల రైతులు మృతుడి చెల్లెలికి సమాచారం అందించారు. తన అన్న తరచుగా కడుపునొప్పితో ఇబ్బందులు పడేవాడని, ఆ బాధ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
అప్పులు కట్టలేక..
జడ్చర్ల: అప్పులు కట్టలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక ఎర్రగుట్టలోని డబుల్‌బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న వడ్డె సంజీవ (30) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం భార్య శ్రీలత తన ముగ్గురు పిల్లలను తీసుకొని తల్లి గారింటికి వెళ్లింది. తిరిగి అదే రోజు సాయంత్రం భార్య ఇంటికి వచ్చే సరికి బెడ్‌రూంలో భర్త వడ్డె సంజీవ ఫ్యాన్ కొండికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కుటుంబ అవసరాల నిమిత్తం సంజీవ స్థానికంగా పలువురితో డబ్బులు అప్పుగా తీసుకుని వాడుకొన్నాడు. అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయాడని, ఈ కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య శ్రీలత చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రైలు ఢీకొని
యువకుడికి గాయాలు
దేవరకద్ర: మండల కేంద్రంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ యువకుడు గాయపడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. పేరు తెలియని యువకుడిది మహబూబ్‌నగర్ మండలం ఓబ్లాయిపల్లితండాగా తెలిసింది. కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment