వనపర్తి సంస్కారంతోనే సీఎం అయ్యా
వనపర్తిటౌన్: వనపర్తిలో విద్యార్థి దశ రాజకీయ చైతన్యంతోనే, ఈ ప్రాంత సంస్కారంతోనే తాను సీఎం స్థాయికి ఎదిగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 40ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తమ వెంట కలిసిమెలిసి తిరిగిన స్నేహితుడు సీఎం హోదాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడంతో అలనాటి మిత్రులు, గురువులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983–85 ఇంటర్ బ్యాచ్, పాఠశాలలో చదివిన విద్యార్థులను ఒక్కొక్కరిని సీఎం రేవంత్‌రెడ్డి పేరుపెట్టి పిలుస్తూ తరగతి గదిలోని చేదు, తీపి జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకున్నారు. కొన్ని విషయాలను ఆయన గుర్తుపెట్టుకొని చెబుతుండటంతో మిత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం తన మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి రాలేని మరి కొంతమంది మిత్రులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పారు. నాడు చదువు చెప్పిన గురువులకు వినమ్రంగా నమస్కరించడంతో గురువులు మాశిష్యుడు సీఎం అయ్యాడని మురిసిపోతూ రేవంత్‌రెడ్డి భుజంపై చేయి వేసుకొని ముందుకు సాగారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని కొందరు మిత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిధుల కొరత ఉందని, త్వరలోనే పరిస్థితులు అన్ని చక్కదిద్దుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం.
స్నేహితులతో నాటి జ్ఞాపకాలను పంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆయనకు స్వాగతం పలికిన పార్వతమ్మ కుటుంబ సభ్యులు
వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
ఇంటి యజమానిని కలిసిన సీఎం
6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చిన్నారెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉన్న పార్వతమ్మ కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఆయన ఆకుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అలనాటి జ్ఞాపకాలను సీఎం వారితో నెమరేసుకోవడంతో వారి మధ్య నవ్వులు విరబూశాయి. 40ఏళ్ల కిందట తమ ఇంట్లో అద్దెకు ఉన్న విషయాన్ని గుర్తించుకొని సీఎం రేవంత్‌రెడ్డి మమ్మల్ని కలవడం ఆయన సంస్కారానికి, గౌరవ మర్యాదలకు నిదర్శనమని చెప్పగానే పునాదిని మర్చిపోకూడదనే తాను గుర్తించుకున్నట్లు సీఎం వెల్లడించారు.
వనపర్తి సంస్కారంతోనే సీఎం అయ్యా
Comments
Please login to add a commentAdd a comment