వరి రైతులు తగు సూచనలు పాటించాలి
అలంపూర్ : రబీలో రైతులు వరి పంట సాగు చేశారు. పంట సాగు జాప్యం చేసిన రైతులు తగిన సూచనలు పాటించాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియనాయక్ సూచించారు. అందుకు అనుగుణంగా పంట సాగుచేస్తే దిగుబడి సాధించొచ్చని పేర్కొంటున్నారు.
పొలం తయారీ :
నాట్లు వేయడానికి 2–3 సార్లు దమ్ము చేయాలి. ఆఖరి దమ్ములో ఎకరాకు 40 కిలోల వేప పూత యూరియా, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చదరపు మీటర్‌కు 44 కుదుళ్లు ఉండేలా నాటాలి. నాట్ల తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటలు ఉండేలా చూసుకోవాలి. పైరుకు గాలి, వెలుతురు సమంగా అంది చీడపీడల ఉధృతి తగ్గుతుంది.
ఎరువుల యాజమాన్యం
నాట్లు వేసిన 30 నుంచి 60 రోజుల దశలో బురద పదును ఉన్న సమయంలో ఎకరాకు 30 కిలోల వేప పూత యూరియా వేయాలి. దీంతో పిలకలు ఎక్కువగా వచ్చి దుబ్బు బాగా కడుతోంది. తేలిక నేలల్లో అంకుర దశలో (నాటిన 60 రోజుల్లో) ఎకరాకు 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
నీటి యాజమాన్య పద్ధతులు
పొలంలో వరి నాటే సమయంలో 2 సెం.మీ మేరకు నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలి. నాట్ల అనంతరం 4–5 రోజుల వరకు 5 సెం.మీ మేరకు నీరు ఉండేలా చూసుకోవాలి. మొక్కలు త్వరగా వేరు తొడుగుతాయి. తర్వాత 2 సెం.మీ మాత్రమే నీరు ఉంచాలి. ఆ సమయంలో నీరు ఎక్కువైతే పిలకలు తక్కువగా వస్తాయి. పంట పొట్ట దశ నుంచి గింజలు పాలుపోసుకోని గట్టిపడే వరకు 5 సెం.మీ నీరు పెట్టాలి. పంట మధ్యకాలంలో అప్పుడప్పుడు నీరు తీసి పొలాన్ని ఆరబెట్టి తిరిగి నీరుపెట్టాలి. ఇలా చేయడంతో పైరు ఆరోగ్యంగా ఉండి చీడపీడల బెడద తగ్గుతుంది.
కలుపు నివారణ : నాట్లు వేసిన 3–5 రోజుల్లో ఎకరానికి 40 గ్రాముల ఆక్సాడయార్జిల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
సల్ఫైడ్ దుష్ప్రభావం :
పంట మధ్యకాలంలో పైరుకు అక్కడక్కడ కుదుళ్లు పసుపు రంగులోకి మారుతాయి. దీనినే సల్ఫైడ్ దుష్ప్రబావంగా పేర్కొంటారు. ఈ సమస్య ఉన్న పొలంలో నేల మొత్తబడి కాలు దిగబడిపోతుంది. పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటికి వస్తోంది. నేల నుంచి దురువాసన వస్తోంది.
పంటకు ఆశించే పురుగులు
నారుమడి నుంచి అంకురం వరకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. పిలక దశలో ఈ పురుగు ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి. పంట చిరు పొట్టదశలో ఆశిస్తే తెల్ల కంకులు వస్తాయి. నివారణకు లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ గులికలు 4 కిలో చొప్పున చల్లి నివారించాలి.
నివారణ
మొక్కల వేర్లకు తగినంత గాలి అందేలా చూడాలి. మురుగు నీటిని బయటికి పంపి కొత్త నీటిని పెట్టాలి. అమోనియం సల్ఫైట్ (21 శాతం నత్రజని 25 శాతం గంధకం ఉన్న ఎరువు) ఎరువులను పంటకు వాడకూడదు.
Comments
Please login to add a commentAdd a comment