హన్వాడ: కట్టుకున్న ఇల్లాలే భర్తను కడతేర్చిన ఘటన మండలంలోని ఇబ్రహీంబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఇబ్రహీంబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) సెంట్రింగ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. ఆదివారం ఎప్పటిలాగే కూలీ పనులను ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. అయితే కూలి డబ్బుల్లో రూ. 5వేలు తగ్గడంతో అతడి భార్య లక్ష్మి గొడవకు దిగింది. డబ్బులు ఎందుకు తగ్గా యని భార్య నిలదీయడంతో తన తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బును చెల్లించినట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలపడంతో ఇరువురి మధ్య గొడవ మరింత పెరిగింది. తమ సంబంధీకులు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పారు. ఈ క్రమంలో రాత్రి అందరూ నిద్రించిన తర్వాత కుమారుడు రాముతో కలిసి లక్ష్మి శ్రీనివాస్‌గౌడ్ గొంతు నులిమి హత్యచేశారు. ఇదిలా ఉంటే, అతడి పేరుపై వ్యవసాయ భూమి, గృహరుణం ఉన్నాయి. అయితే భర్త శ్రీనివాస్‌గౌడ్ మరణిస్తే ఇన్సూరెన్స్ వర్తించడంతో ఇంటి అప్పుతీరి, ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయనే కోణంలో హత్య జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అతడి భార్య లక్ష్మిని స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించడంతో కుమారుడు రాముతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment