పీయూ సిబ్బంది వేతనాల పెంపుపై కమిటీ భేటీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నాలుగేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో 2018లో వైస్ చాన్స్‌లర్ రాజారత్నం ప్రతి సంవత్సరం 12 శాతం వేతనాలు పెంచేలా ప్రతిపాదనలు చేసి 2021 సంవత్సరం వరకు కొనసాగించారు. ఆ తర్వాత వీసీగా వచ్చిన లక్ష్మీకాంత్ రాథోడ్ వేతనాల పెంపుదలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నూతనంగా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ సిబ్బంది వేతనాల పెంపుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అందుకోసం ఒక కమిటీని నియమించగా.. సోమవారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భేటీ అయ్యింది. వేతనాల పెంపు ఎంత మేరకు ఉండాలి.. గతంలో ఎంత మేరకు పెంచారు అనే అంశాలపై చర్చించారు. ఈ కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తే దాని ఆధారంగా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం అనంతరం సిబ్బంది వేతనాలు పెంచేందుకు చర్యలు చేపడుతారు. కమిటీ భేటీలో పీయూ మాజీ రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, ప్రొఫెసర్ అప్పారావు, పీయూ అధ్యాపకులు కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
155 మందికి ప్రయోజనం..
యూనివర్సిటీలో తాత్కాలిక పద్ధతిలో 155 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో అటెండర్, స్వీపర్ స్థాయి వారికి రూ.7 వేలు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు రూ.9 వేల చొప్పున వేతనాలు ఉన్నాయి. రెగ్యులర్ సిబ్బందికి రూ.50 వేలకుపైగా వేతనాలు ఉండగా.. తాత్కాలిక సిబ్బందికి అరకొర వేతనాలు అందుతున్నాయి. గత వీసీ హయాంలో వేతనాల పెంపుకోసం పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపాదనలు పెట్టినా పెంపు మాత్రం జరగలేదు. దీంతో చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో పలువురు ఉద్యోగాలు మాని వెళ్లిపోగా.. పలువురు రిటైర్డ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సిబ్బందికి త్వరగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నాన్‌టీచింగ్ సిబ్బంది కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment