స్ప్రింక్లర్లతో ఉల్లి సాగు చేద్దాం
అలంపూర్: మైక్రో స్ప్రింక్లర్లతో ఉల్లి పంట సాగు చేయడంతో ఆశించిన దిగుబడి సాధించొచ్చని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. జిల్లాలో నీటి సౌకర్యం ఉన్న రైతులు యాసంగిలో ఉల్లిని సాగు చేయడం లాభదాయకమన్నారు. పంట సాగు చేసిన రైతులు మైక్రో స్ప్రింక్లర్లను వాడడం ద్వారా నీటి ఆదా అవుతుందని తెలిపారు. దీనితో పాటు వ్యవసాయ అధికారుల సూచనలతో ఎరువులు సరైన మోతాదులో వాడితే పంట నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
నాటులో జాగ్రత్తలు
ఒక ఎకరానికి 1.4 లక్షల మొక్కల సాంద్రత ఉండేటట్లుగా నాటుకోవాలి. వరుసకు వరస 10 సెంటీమీటర్లు ఉండాలన్నారు. నారు నాటే సమయంలో వాటిని కార్బండిజమ్ 1 గ్రామును లీటర్ నీటికి, మోనోక్రోటోపాస్ 2 మి.లీ నీటితో కలిపిన ద్రావణంలో వేర్లను ముంచి నాటితే మొక్క పెరుగుదల బాగుందని వివరించారు.
మైక్రో స్ప్రింక్లర్లు అమర్చే విధానం
16 మిల్లీ మీటర్ల లేటరల్స్‌ను ప్రధాన పీవీసీ పైపునకు ప్రతి నాలుగు మీటర్ల దూరంలో అమర్చాలి. ప్రతి లేటరల్ పైపు మీద 4 మీటర్ల దూరంలో 8 మి.లీ మీటర్ల ప్లాస్టిక్ పైప్ ద్వారా ఒక మైక్రో స్ప్రింక్లర్లను అమర్చాలి. దీనిని 3 అడుగుల ఎత్తులో అమర్చుకోవాలని సూచించారు. ప్రతి మైక్రో స్ప్రింక్లర్లు గంటకు 148 లీటర్ల నీటిని విడుదల చేస్తోంది.
తెగుళ్ల
నేలలో ఎల్లప్పుడు తగినంత తేమ ఉండటం వలన ఉల్లి గడ్డలు సమాన పరిమాణంలో పెద్దగా పెరుగుతాయి. పంటకాలం 15 నుంచి 17 రోజులు తగ్గుతుంది. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటి తుంపర్ల వలన శీలింద్రపు తెగుళ్లు ఆశించవు. రసం పీల్చే పురుగులు తుంపర్లకు కొట్టుకొని పోతాయి. మొక్కల సంఖ్య పెరగడం వలన 30 నుంచి 40 శాతం అధిక దిగుబడి వస్తోంది.
కలుపు నివారణ
2 నుంచి 3 సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. నారు నాటిన మూడు రోజుల తర్వాత పెండిమిథాలిన్ అనే లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 45 రోజులకు ఒకసారి కలుపుతీయాలి.
నీటి యాజమాన్యం
పొలంలో నీటి నిల్వ ఉంచరాదు. నీరు నిలువ ఉంటే గడ్డ నాణ్యత తగ్గిపోతుంది. ఉల్లి వేరు 10–15 సెం.మీ వరకే ఉంటుంది. కాబట్టి అవసరం ఉన్నంత వరకే నీటిని పెట్టాలి.
సస్యరక్షణ
తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా మిథైల్ డెమటాన్ 2మి.లీలు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆకుమాడు తెగులు నివారణకు సాఫ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి లేదా కిటాజెన్ ఒక మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎరువులు
ఉల్లి నాటిన 30 రోజులకు, 60 రోజులకు యూరియా లేదా సీఏఎన్ వేసుకోవాలి. ఎకరానికి 10–15 కిలోల సల్ఫర్ వాడాలి. దీనివలన నాణ్యమైన గడ్డలు వస్తాయి. 50 కిలోల భాస్వరం 60 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు నాటే ముందు వేసుకోవాలి.
పాడి–పంట
స్ప్రింక్లర్లతో ఉల్లి సాగు చేద్దాం
Comments
Please login to add a commentAdd a comment