మహబూబ్‌నగర్ క్రైం: విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా పోలీస్‌శాఖ పని చేస్తోందని ఎస్పీ డి.జానకి అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పలు ముఖ్య కూడళ్లు, ప్రార్థన మందిరాలను ఎస్పీ పరిశీలించారు. స్థానికంగా పోలీస్ సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు అనే అంశంపై తనిఖీ చేశారు. నేరాలను నివారించే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా శాంతి భద్రతలను రక్షించాలన్నారు. తనిఖీల్లో డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటి వద్దకే రాములోరి కల్యాణం తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: భద్రాచలంలో వచ్చేనెల 6వ తేదీన జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా కల్యాణ తలంబ్రాలను ఇంటివద్దకే చేరవేస్తామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, లాజిస్టిక్ ఏటీఎం ఇసాక్‌బిన్ మహ్మద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఒక పాకెట్‌కు రూ.151 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం ఆయా డిపోల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించాలని కోరారు.
డీఈఐసీ కేంద్రం పరిశీలన
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఉన్న డీఈఐసీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. డీఈఐసీ కేంద్రంలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే అంశంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేకవిధానాలపై పోరాటం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక విధానాలను అవలంబిస్తోందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు అన్నారు. ఇప్పలపల్లిలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఉపాధి లేక గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస పోతున్నారని, అక్కడ వారి జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. పోరాడి సాధించుకున్న చట్టం కాగితాలకే పరిమితమవుతున్నాయని, మారుతున్న పాలకులు ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 25న జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న భవన, నిర్మాణ కార్మిక సంఘం సభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేష్, నాయకులు గోవర్ధన్, ఉషన్న ఆంజనేయులు, శేఖర్, మల్లేష్, రవి, కే.నర్సింహులు, పి.చంద్రమౌళి చెన్నయ్య పాల్గొన్నారు.
బాలకార్మిక చట్టాలపై అవగాహన
పాలమూరు: జిల్లాకేంద్రంలోని షెల్టర్ హోం బాయ్స్ గృహాన్ని మంగళవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సందర్శించారు. స్థానికంగా అందుతున్న వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆ తర్వాత న్యూ లైఫ్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు.
నేరాలను అరికట్టడమే పోలీస్‌శాఖ లక్ష్యం: ఎస్పీ