జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది.
హాస్టళ్లలో మౌలికవసతులు కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి హాస్టళ్లు, కేజీబీవీలలో మౌలిక వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికల గురుకులాలు, వసతి గృహాలలో సీసీ కెమెరాలు పని చేసే స్థితిలో ఉండాలన్నారు. అదనపు టాయిలెట్లు అవసరం ఉన్న చోట ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అత్యవసర చిన్న, చిన్న మరమ్మతులు వెంటనే చేపట్టాలని, కిచెన్, వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్టీ సంక్షేమాధికారి ఛత్రునాయక్, మైనార్టీ శాఖ జిల్లా అధికారి శంకరాచారి పాల్గొన్నారు.