జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జల వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రపంచ జలవనరుల దినోత్సవం 2025 సందర్భంగా ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, ఎంపీఓలకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భజలాలు తగ్గడంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య వస్తుందన్నారు. పూర్వం రాజ్యాధికారం, సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిగేవని, రానున్న రోజుల్లో నీటికోసం యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. భూగర్భ, ఉపరితల జలంను గృహ, వ్యవసాయ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు మితిమీరి వాడడం వల్ల భూగర్భ జలమట్టం తగ్గిపోవటానికి కారణం అన్నారు. చెరువులు, కుంటలు నుంచి నీటిని తోడేయడం, ఆటోమేటిక్ స్టార్టర్‌లు వినియోగంతో నీటి వృథా జరుగుతుందన్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతి ఏడాది పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో ల్యాండ్ స్కేపింగ్‌తో పచ్చదనం పెంపొందించేలా మొక్కలు పెంచాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ భూగర్భజలాలు ప్రాధాన్యత గురించి వివరించారు. జిల్లాలో బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, రాజాపూర్ ప్రాంతాల్లో భూగర్భ జలాల వెలికితీత అధికస్థాయిలో ఉందని తెలిపారు. టీజీ వాల్టా 2002 సెక్షన్ 8, సబ్ సెక్షన్ (2) ప్రకారం భూగర్భజల వనరులకు సంబంధించి బోర్లు వేసేందుకు ప్రతి వ్యవసాయ, గృహ యజమాని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇందుకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్‌కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రపంచ జలవనరుల దినోత్సవం 2025 బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో నీటి సంరక్షణ స్థిరమైన నీటి నిర్వహణలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులు, పాఠశాలలు మరియు కమ్యూనిటీ సమూహాలను గుర్తించి కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, డీఆర్‌డీఓ నర్సింహులు, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, భూగర్భ జలశాఖ జియాలజిస్ట్‌లు లావణ్య, ధీరజ్ కుమార్, ద్వారకానాథ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భవిష్యత్‌లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం
అవసరాలకు మించి వాడడం వల్లే భూగర్భ జలాల తగ్గుదల
కలెక్టర్ విజయేందిర బోయి