
తాగునీటి వృథాను అరికట్టలేరా?
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీరు వృథాగా రోడ్లపై పారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవైపు పలు చోట్ల పైపులైన్, గేట్‌వాల్వ్‌ల వద్ద లీకేజీలు ఉన్నా మున్సిపల్ అధికారులు మరమ్మతు చేయించడం లేదు. మరోవైపు కొందరు ఇంటి యజమానులు తమ అవసరాలకు సరిపడా వాడుకున్నాక నల్లాలను బంద్ చేయకుండా పైపులతో ఆవరణలను కడగడం, మోరీలలో వదలడం వంటి పనుల కారణంగా వృథా అవుతోంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో రెండు రోజుల కోసారి మొత్తం 28 ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారాతాగునీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో వినియోగం అధికంగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో సుమారు గంట పాటు, మరికొన్ని ప్రాంతాల్లో అరగంట మాత్రమే అందుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
నగరంలో ఇదీ పరిస్థితి..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల పరిధిలో 3,36,647 మంది జనాభా ఉన్నారు. అందరికీ కలిపి తాగునీరు కనీసం 40 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) అవసరం. అయితే ప్రస్తుతం 33.5 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా అవుతోంది. ఇక ఒక్కొక్కరికి కనీసం 135 ఎల్‌పీసీడీ (లీటర్ పర్ కెపాసిటీ డైలీ) నీరు అవసరం. కాగా, మిషన్ భగీరథ పథకం ద్వారా 100 ఎల్‌పీసీడీ మాత్రమే అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాగునీటిని పట్టుకున్నాక చాలా వరకు ఇంటి యజమానులు తమ ఆవరణను శుభ్రం చేసేందుకని, వాహనాలు కడగడానికి పైపులతో వృథాగా వదులుతున్నారు. ఇది కాస్తా రోడ్ల వెంట ఏరులై పారుతూ ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాదాపు అన్ని గల్లీలలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు వివిధ చోట్ల పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ల వద్ద లీకేజీలున్నా మున్సిపల్ అధికారులు మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా జడ్చర్ల–రాయచూర్ రోడ్డు (ఎన్‌హెచ్– 167)పై డిస్లేరిగడ్డ (హనుమాన్‌పురా) వద్ద, హెచ్‌పీ పెట్రోల్ పంపు సమీపంలో, న్యూటౌన్‌చౌరస్తాలో, జీజీహెచ్‌కు ఎదురుగా, మెట్టుగడ్డ వద్ద, అలాగే తెలంగాణ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు రెండు చోట్ల, కలెక్టర్‌బంగ్లా చౌరస్తా నుంచి బోయపల్లిగేట్ (నవాబుపేట రోడ్డు వెంట) మోతీనగర్ వరకు మూడు చోట్ల, పద్మావతికాలనీలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద, భూత్పూర్ రోడ్డులో మైత్రీనగర్ వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రోడ్ల వెంట తాగునీరు వృథాగా పారుతోంది.
అసలే వేసవి కాలం.. వినియోగం అధికం
నగరంలో రెండు రోజులకోసారి సరఫరా
ఎక్కడబడితే అక్కడ పైపులైన్ లీకేజీలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు

తాగునీటి వృథాను అరికట్టలేరా?