
ఇన్విటేషన్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ఆటగాళ్లను పరిచయం చేసుకొని మాట్లాడారు.ఈ వయసులో కూడా సీనియర్ క్రీడాకారులు ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న సీనియర్ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ సంఘం ఉపాధ్యక్షులు టీఎస్.రంగారావు, రమేశ్, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, గజానంద్‌కుమార్, నందకిషోర్, వడెన్న, నగేశ్‌తోపాటు విశాఖపట్నం కోచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
● ఈ టోర్నీలో విశాఖపట్నం, నెల్లూర్, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థుల జట్టు, మహబూబ్‌నగర్ జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు మ్యాచుల్లో విశాఖపట్నం 4–2 గోల్స్ తేడాతో ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టుపై విజయం సాధించింది. నెల్లూరు జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులపై గెలుపొందింది. విశాఖపట్నం 1–0 గోల్స్ తేడాతో ఏపీ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థులపై, నెల్లూరు జట్టు 4–1 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించాయి. ఆదివారం కూడా ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నీ కొనసాగనుంది. టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్లు విన్నర్, రన్నరప్‌గా నిలుస్తాయి.
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం
అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్