
అగ్నిప్రమాదాలపైఅవగాహన తప్పనిసరి
మహబూబ్‌నగర్ క్రైం: అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సిబ్బంది స్మారక కవాతు నిర్వహించగా.. అగ్నిమాపక జెండాను ఎగురవేశారు. 1944లో ముంబాయిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 66మంది అగ్నిమాపక సిబ్బందికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్‌ను విశ్రాంత అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు డీఎఫ్‌ఓ కిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అధికారి మల్లిఖార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు విద్యుత్ అంతరాయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని 11 కేవీ వెంకటేశ్వరకాలనీ ఫీడర్ పరిధిలో చెట్ల కొట్టివేత కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ టౌన్–3 ఏఈ అరుణ్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.
డిగ్రీ కళాశాలలోనే
ఎన్నికల సామగ్రి
● గదుల కొరతతో అవస్థలు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ డా. సుకన్య కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ నర్సింగ్‌రావును వివరణ కోరగా.. ఎన్నికల సామగ్రి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తరలిస్తామన్నారు. తమ పాత కార్యాలయంలో వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

అగ్నిప్రమాదాలపైఅవగాహన తప్పనిసరి