
పాలమూరే మా ప్రాధాన్యం
● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పెండింగ్
పనులన్నీ పూరి ్తచేస్తాం
● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులను ఏడాదిలోనే వంద శాతం పూర్తిచేస్తామని, రెండేళ్లలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను సైతం పూర్తి చేసి.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు నీటిని అందిస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి గురువారం పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, పనుల పురోగతిని పరిశీలించారు.
2027 మార్చి కల్లా..
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను సైతం 2027 మార్చికల్లా పూర్తిచేసి ఉదండాపూర్ వరకు నీటిని అందిస్తామని మంత్రి చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఏదుల వద్ద పంప్‌హౌస్‌లో ప్రస్తుతం రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని, పూర్తిస్థాయిలో ఐదు మోటార్లతో నీటి ఎత్తిపోతలకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పెండింగ్ పనులు, భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. పాలమూరు– రంగారెడ్డి కింద గతంలో కేసీఆర్ ఒక్క మోటారు ఆన్ చేసి హడావుడి చేశారని, అది తాత్కాలికంగా చేసిన ఏర్పాటేనని విమర్శించారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సరఫరా, పవర్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే రూ.262 కోట్లు మంజూరు చేశామని, ఈ నెలాఖరులోగా పవర్‌స్టేషన్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
● నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల వైపు వెళ్లే అప్రోచ్ కెనాల్ 6.5 కి.మీ., వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆరు నెలల్లోగా పెండింగ్ పనులు పూర్తిచేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగమైన ఏదుల పంప్‌హౌస్‌లోని మోటార్లను పరిశీలించారు. మోటార్ల రిపేరు త్వరగా పూర్తిచేయాలని, పూర్తిస్థాయి సామర్థ్యం 5 మోటార్లను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 40 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తేనే ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అనంతరం పాలమూరు– రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను, వట్టెం పంప్‌హౌస్‌ను సందర్శించారు. సొరంగం లోపల గతంలో నీట మునిగిన వట్టెం పంప్‌హౌస్‌ను అధికారులు పునరుద్ధరించారు. ఇప్పటి వరకు నాలుగు మోటార్లను బిగించగా, మరో మోటారు బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు నెలల్లోగా మోటార్ల బిగింపు, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.