సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: థాయ్‌లాండ్‌లో గ్యాబ్లింగ్ ఆడుతూ పట్టుబడిన వారిలో జిల్లా వాసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ‘చీకోటి’తో చాలా కాలంగా జిల్లా వారితోనూ సంబంధాలు ఉన్నాయి. గతంలో గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జూదాల్లో పాల్గొంటున్నవారు ఉన్నారు. ఈనెల 1న థాయ్ పోలీసులు చట్టవిరుద్ధంగా గ్యాబ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి ఓ హోటలో రైడింగ్ చేశారు. ఈ రైడ్‌లో 93 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 83 మంది భారతీయులే. వారి నుంచి సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో ఎక్కువగా తెలుగు, అందులోనూ హైదరాబాద్, ఇతర జిల్లా ప్రాంత వాసులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన వారిలో వ్యాపారులు, రాజకీయ నాయకులు, రియల్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
దేశం దాటిన జూదం..
జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లు.. పొరుగున ఉన్న మహారాష్ట్ర వెళ్లి పేకాడడం సాధారణం. ఇన్నాళ్లు రాష్ట్రం దాటిన జూదం.. ఇప్పుడు దేశం దాటినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌తోపాటు గతంలో పేకాట వ్యసనంలో ఆరి తేరిన ఒకరు ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి పలువురు పేకాట, కేసినో ఆడేందుకు తరచూ గోవా వెళ్తుంటారు. ఇటీవల జిల్లా నుంచి కొందరు దుబాయ్ మీదుగా థాయ్‌లాండ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు థాయ్‌లాండ్ జరుగుతున్న గ్యాబ్లింగ్‌ను లైవ్‌లో సీసీ కెమెరాలతో హైదరాబాద్‌లో వీక్షిస్తూ, డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఇందులో ఈ ప్రాంత వాసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసు, దర్యాప్తు అంతా విదేశాల్లోనే జరుగుతుండడంతో అధికారికంగా వివరాలేవి వెల్లడికావడం లేదు.
తెలంగాణలో నిషేధం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేకాటను పూర్తిగా నిఽషేధించారు. దీంతో రమ్మీ లాంటి ఆటలు ఆడేందుకు వీలు లేకుండా పోయింది. ఏళ్లుగా పేకాటకు బానిసలుగా ఉన్న కొందరు కొంతకాలంపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, రాజురా, సిరోంచ, సిర్పూర్ టీ సరిహద్దు పోడ్సా తదితర ప్రాంతాల్లో పేకాట క్లబ్‌ల్లో రాత్రింబవళ్లు ఆడేవారు. జిల్లా నుంచి ప్రతీరోజు అనేక మంది వెళ్తుండేవారు. జిల్లా వాసులే పేకాట నిర్వాహకులుగా ఉండేవారు. ఫంటర్లు (పేకాట ఆడేవారు)వాహనాల్లో తీసుకెళ్లేవారు.
స్పోర్ట్స్ క్లబ్‌ల మాటున..
స్పోర్ట్స్ క్లబ్‌ల మాటున అనధికారికంగా రూ.కోట్ల దందా సాగుతున్న తీరును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో అన్నిచోట్ల క్లబ్‌లు బంద్ అయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో మామిడితోటలు, అపార్ట్‌మెంట్లు రహస్య స్థావరాల్లో పేకాడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. అప్పట్లో తెలంగాణ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో కొన్నాళ్లు పేకాట సాగింది. అన్ని చోట్లారైడింగ్‌లు జరుగుతుండడంతో రూటు మార్చి పేకాటరాయుళ్లు గోవా, దుబాయ్, థాయ్‌లాండ్‌కు వెళ్లి అడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పేకాట కన్నా కేసినోకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో వ్యసనపరులు ఆ గేమ్‌లోనూ డబ్బులు పెట్టి ఆడుతున్నట్లు సమాచారం. విదేశీ పర్యటన పేరుతో రోజుల తరబడి వెళ్లి లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇంటికి చేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment