కాయిన్ కొడితే..కప్ పడాల్సిందే
● క్యారమ్స్‌లో రాణిస్తున్న సింగరేణి క్రీడాకారుడు ● కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్స్
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిలోనే కాదు ఆటల్లో తమకు తామే సాటి అంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రేణికుంట్ల సృజన్‌రావు క్యారమ్స్‌లో జాతీయస్థాయి పోటీల్లో రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బోర్డుపై కూర్చొని కాయిన్స్ కొడితే కప్ తన ఖాతాలో పడాల్సిందే అంటున్నాడు. తనదైన ఆట తీరుతో పలు బహుమతులు సాధించాడు. ఈయన 2020లో కారుణ్య కింద సింగరేణిలో ఉద్యోగంలో చేరారు. సింగరేణిలో రాకముందే ఆయనకు ఈ ఆటపై పట్టుంది. హైస్కూల్ లెవల్ నుంచే క్యారమ్స్‌పై పట్టు సాధించాడు. ఇంటర్, డిగ్రీలో తన ఆటకు మరింత పదును పెట్టాడు. కళాశాల స్థాయిలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. నిజామాబాద్‌లోని భీంగల్, హైదరాబద్‌లోని ఖైరతాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు అందుకున్నాడు.
జాతీయస్థాయిలో పోటీల్లో..
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆలిండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీల పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు సాధించాడు. 2024 మార్చిలో ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో సెమీస్ వరకు వెళ్లాడు. అదే ఏడాది మధ్యప్రదేశ్‌లోని సింగరోలిలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 జనవరిలో జార్జండ్‌లోని రాంచీలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఈ పోటీల్లో సింగరేణి జట్టు టీం ఛాంపియన్ సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
ప్రోత్సహిస్తే శిక్షణ ఇస్తాను
కంపెనీ మరింత ప్రోత్సాహిస్తే నేను మెరుగ్గా ఆడటమే కాకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చే స్తాను. కంపెనీ క్లబ్‌లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఉద్యోగులతో పాటు వారి పిల్లలకు ఆట నేర్పించాలని ఉంది. ఈ ఆటలో మహిళలు తక్కువగా ఉన్నారు. పోటీ లేనందున వారు నేర్చుకుంటే సులువుగా రాణించగలుగుతారు. జాతీయ స్థాయిలో పాల్గొంటే చాలు బ్యాంకుల్లో తదితర సంస్థల్లో పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. – సృజన్‌రావు
కాయిన్ కొడితే..కప్ పడాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment