
నమ్ముకున్న గంగమ్మే మింగిందా కొడుకా..
వేమనపల్లి: హోలీ పండుగ ఆ ఇంటి ఆశాదీపాన్ని ఆర్పేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్నేహితులతో హోలీ ఆడిన ఆ యువకుడు స్నానం కోసం ప్రాణహిత నదిలో దిగాడు. అయితే లోతు, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఈ విషాద ఘటన వేమనపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రంలోని బెస్తవాడకు చెందిన కంపెల రాజ్‌కుమార్(21) చెన్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. పండుగ నేపథ్యంలో స్నేహితులు కంపెల నవీన్, అనిల్, బక్కి రాకేశ్, చింతల అభిషేక్, గుమ్ముల సాయికిరణ్‌తో కలిసి గ్రామంలో హోలీ జరుపుకున్నాడు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ప్రాణహిత నది పుష్కరఘాట్ ఎగువన ఉన్న మొహిబిన్‌పేట రేవు వద్దకు స్నానాలకు వెళ్లారు. సాయికిరణ్, రాజ్‌కుమార్ నదిలో దిగగా, మరో నలుగురు ఒడ్డున ఉన్నారు. అయితే స్నానాలకు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడం, వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో రాజ్‌కుమార్ కొట్టుకుపోయాడు. ఈత రాకపోవడంతో సాయికిరణ్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో మిగతా స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నాడు. జాలర్ల సాయంతో మూడు గంటలు గాలించగా సాయంత్రం రాజ్‌కుమార్ మృతదేహం లభించింది. పండుగను సంబురంగా జరుపుకున్న రాజ్‌కుమార్‌ను విగత జీవిగా నదిలో నుంచి తీసుకు వస్తుండగా చూసిన తల్లి లక్ష్మి ‘నువ్వు పురిటిలో ఉండగానే మీ నాన్న కాలం చేసిండు కద కొడుకా.. కూలీనాలి చేసి.. జిమ్మలు పట్టుకుంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటి.. మనం నమ్ముకున్న గంగమ్మే నిన్ను మింగిందా బిడ్డా.. నాకు కడుపు కోత మిగిల్చింది కొడుకా’ అంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఒక్కగానొక్క కొడుకు మరణంతో కన్నీరుమున్నీరవుతున్న లక్ష్మిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు.
ప్రాణహిత నదిలో మునిగి యువకుడు మృతి
హోలీ ఆడి స్నానానికి వెళ్లడంతో ప్రమాదం
పండుగపూట విషాదం

నమ్ముకున్న గంగమ్మే మింగిందా కొడుకా..
Comments
Please login to add a commentAdd a comment