
జల సంరక్షణకు ‘కృషి’
చెక్‌డ్యాం (ఫైల్)
పాత మంచిర్యాల: పరుగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని ఆపాలి.. ఆగిన నీటిని భూమిలో ఇంకింపజేయాలి.. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం 2022లో జిల్లాలో ప్రారంభమైంది. ఈ పఽథకం ద్వారా జిల్లాలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వలు పెంచేందుకు జల సంరక్షణ, మట్టి సంరక్షణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాళ్ల కట్టలు, ఊట కుంటలు, చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. జిల్లాలోని కాసిపేట, జైపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. మరిన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మించిన రాళ్ల కట్టలు, ఊట కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పథకంలో భాగంగా రెండు మండలాల్లో 12 ఊట కుంటలు, మూడు చెక్‌డ్యాంలు, ఐదు విడిరాళ్ల కట్టల నిర్మాణ పనులు ప్రారంభించారు. కాసిపేట మండలంలోని సోనాపూర్‌లో రూ.1.30 లక్షల నిధులతో మట్టి సంరక్షణ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. రూ.45.6 లక్షలతో తొమ్మిది ఊట కుంటలు, రూ.17.4 లక్షల నిధులతో మూడు చెక్‌డ్యాంల పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కాసిపేట మండలంలోని ఐదు గ్రామపంచాయతీల పరిధిలో, జైపూర్ మండలంలోని ఆరు పంచాయతీల పరిధిలో రూ.11.49 కోట్ల నిధులతో 340 పనులు చేపట్టేందుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని తెలిపారు. 2026 మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పీఎం కేఎస్‌వై ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
పీఎంకేఎస్‌వైతో భూగర్భజలాల పెంపు
పంటల సాగుకు, పర్యావరణానికి మేలు
రైతులకు మేలు
పీఎంకేఎస్‌వై పథకంలో భాగంగా చేపట్టే రాళ్ల కట్టలు, ఊటకుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయి. సమీప ప్రాంతాల్లోని రైతుల బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో రైతులు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
– కిషన్, మంచిర్యాల జిల్లా
గ్రామీణాభివృద్ధి అధికారి
భూగర్భజలాలు
పెంచేందుకే..
భూగర్భ జల మట్టం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి కొరత లేకుండా చేసేందుకు నీటి ఊట కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతున్నాం. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే నిర్మించి ఉన్న కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతు చేస్తున్నాం.
– శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా
ప్రాజెక్ట్ అధికారి, కృషి సించాయి యోజన

జల సంరక్షణకు ‘కృషి’