
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..
నెన్నెల: ఆర్థిక ఇబ్బందులతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గడ్డం లావణ్య (47), భర్త శంకర్‌గౌడ్‌తో కలిసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట హోటల్ నిర్వహిస్తోంది. హోం లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. హోటల్ పెట్టుబడి కోసం మరికొంత అప్పు చేశారు. వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో అప్పు తీర్చడం కష్టమైంది. కిస్తీలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. అప్పులు ఎలా తీర్చాలో అని ప్రతిరోజు బాధపడేదని కుటుంబీకులు చెప్పారు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున లావణ్య ఇంట్లో కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు చుటూపక్కల వెతకగా భీరన్నమర్రి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు లోట కనిపించాయి. అనుమానంతో బావిలో నీటిని మోటార్ల ద్వారా తోడగా అందులో శవమై కనిపించింది. కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.