
మామిడి మద్దతు ధరకు కృషి
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ● మ్యాంగో మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభం
బెల్లంపల్లి: మామిడికాయలకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లిలో మ్యాంగోమార్కెట్, కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మామిడి రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కష్ట, నష్టాలను రైతులు తన దృష్టికి తేవడంతో క్రయవిక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం ట్రేడర్లతోపాటు ఫ్రూట్ ఎక్స్ కంపెనీతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు వివరించారు. రైతులు వివిధ రకాల పండ్ల తోటలు పెంపకం చేపట్టి ఫలసాయాన్ని ఇదే మార్కెట్‌లో అమ్ముకుని లాభాలు గడించవచ్చని సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు పాటు పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎండీ.షాబుద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జి కార్యదర్శి ఎస్.భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కారుకూరి రాంచందర్, మాజీ ఎంపీటీసీలు ముడిమడుగుల మహేందర్, హరీష్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు బత్తుల రవి, నాతరి స్వామి, ఫ్రూట్ కంపెనీ యజమాని, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు.