
ప్రగతి పరుగు
పాలన మెరుగు..
నూతన ఒరవడికి శ్రీకారం
‘లెస్ ప్లాస్టిక్, లెస్ పేపర్, పవర్ సేవ్’ నినాదంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముందుగా కలెక్టరేట్ నుంచే ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినా స్టీల్ బాటిళ్లలోనే తాగునీరు అందిస్తున్నారు. పారదర్శకంగా పాలన సాగించాలనే దృఢ సంకల్పంతో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఆఫీసుల్లో అవసరం లేనప్పుడు కరెంట్‌ను వినియోగించవద్దని, బయటకు వెళ్లే సమయంలో స్విచ్‌లు ఆఫ్ చేసి పవర్ సేవ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు హెల్మెంట్ ధరించకపోవటంతోనే మరణిస్తున్నారని గుర్తించారు. కలెక్టరేట్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. లోనిచో ప్రవేశం లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందితో పాటు కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరిస్తున్నారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక ఫోకస్
మెదక్‌జోన్: కలెక్టర్ రాహుల్‌రాజ్ ఏడాది పాలనలో తన మార్క్ చూపెట్టారు. ప్లాస్టిక్ నిషేధం, పవర్ సేవ్, ఈ– ఆఫీస్ విధానం పక్కాగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టారు. సెలవు రోజుల్లో సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రావటం కుదరదని ఆదేశాలు జారీ చేశారు. విధులకు ఎగనామం పెట్టే వారిపై వేటు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. గురువారానికి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేక కథనం..
బడిపాట.. బట్టీ చదువులకు ఊరట
బడిబాటపై ‘చిట్టి పొట్టి అడుగులు’ అంటూ కలెక్టర్ స్వయంగా పాట రాశారు. ప్రతీ గ్రామంలో బడీడు పిల్లలుంటే సమీప పాఠశాలల్లో చేర్పించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నర్సాపూర్ మండలం జక్కంపల్లి అనే మారుమూల గ్రామంలో అధికారులతో కలిసి పల్లె నిద్ర చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సైతం ప్రణాళికతో ముందుకెళ్లడంతో గతంలో కంటే ఈసారి ప్రవేశాలు పెరిగాయి. అలాగే ఇటీవల నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి అక్కడే నిద్రించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిందని.. వారికి నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బట్టీ చదువులతో విసిగిపోతున్న విద్యార్థులకు ఊరట కల్పించారు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలని సంకల్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
‘పల్లె వెలుగు’ బస్సులో ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో సరిపడా సీట్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని మీడియా కథనాలను చూసిన కలెక్టర్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన విలువైన కారు ఉన్న సాధారణ ప్రయాణికుడిగా కుటుంబంతో కలిసి కిక్కిరిసిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు ఏ మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు స్వయంగా మెదక్ నుంచి నర్సాపూర్ వరకు భార్య, పిల్లలలో కలిసి ప్రయాణం చేశారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
‘ధరణి’ సమస్యలు పరిష్కారం
ధరణి సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపారు. జిల్లాలో 12 వేల ధరణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా.. కలెక్టర్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే 8,500 సమస్యలను పరిష్కరించగలిగారు. గతంలో ధరణి పెండింగ్ సమస్యల్లో రాష్ట్రంలో మెదక్ 6వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 12 స్థానంలో ఉంది.
మెతుకుసీమ.. టూరిజం హబ్
జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, రాజుల ఏలుబడిలో నిర్మించిన ఖిల్లా, పోచారం అభయారణ్యం, నిజాంపాలనలో నిర్మించన పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానాలకు సంబంధించి ఫొటోలు తీయించారు. త్వరలో టూరిస్టులకు అర్థం అయ్యే విధంగా బుక్ విడుదల చేస్తామని ప్రకటించారు.
తనిఖీ చేసి.. వేటు వేసి
బడిబాట సక్సెస్..
గాడిలో పడిన రెవెన్యూ శాఖ
ఆకస్మిక తనిఖీలతో హడల్
కలెక్టర్ రాహుల్‌రాజ్ ఏడాది మార్క్ పాలన
గతేడాది సెప్టెంబర్ 17న కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, రిజస్టర్‌లో సంతకాలు పెట్టి ముగ్గురు మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఆ ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేశారు. వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారని భావించి అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని కలెక్టరేట్‌లోని తన చాంబర్‌తో పాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి అనుసంధానం చేశారు. వైద్యులు సకాలంలో వస్తున్నారా..? లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment