
చెరువుల చెంత.. సమస్యల చింత
● కనుచూపుమేర గుర్రపు డెక్క ● ప్రజలకు కరువైన ఆహ్లాదం ● చెత్తా చెదారంతో దుర్వాసన
మల్లం చెరువుపై వ్యర్థాలు.
గుర్రపు డెక్కతో కనుమరుగైన మల్లం చెరువు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలోని చెరువులు ఆహ్లాదానికి దూరంగా, చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు, ఈగలు, ప్రాణాంతక కీటకాలకు ఆవాసంగా మారుతున్నాయి. చెరువులను ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కాలనీలు కంపుకొడుతున్నాయి. దీంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పట్టణంలోని మల్లం చెరువు కనుచూపు మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. చెరువుపై నాగులమ్మ, కట్టకింద వీరహనుమాన్ ఆలయాలు ఉన్నాయి. చెరువు పరిసరాలు చెత్తమయం కాగా, ఆలయా లకు వచ్చే భక్తులు అనేక అవస్థలు పడుతున్నారు. భక్తులకు ఆహ్లాదం పంచాల్సిన చెరువు కంపుతో స్వాగతం పలుకుతోంది. పట్టణంలోని పిట్లం చెరువుది అదే తీరు. పలు వీధులకు చెందిన మురికి నీరు అందులో కలుస్తోంది. దీంతో ఆహ్లాదం కోసం చెరువు కట్టపైకి వెళ్లే ప్రజలకు కంపు కలవరపెడుతుంది. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చుదిద్దుతామంటూ పదేళ్లుగా ఊరిస్తున్నా.. పనులు మాత్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు, వ్యాయామం చేయడానికి వస్తుంటారు. దుర్వాసనతో అటు వైపు వెళ్లడానికే జంకుతున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్, విద్యుత్ దీపాలు, వాకింగ్ ట్రాక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్కులు, చిన్నారులకు ఆటస్థలాలు, సేదతీరటానికి కుర్చీలు, పర్యాటక హంగులు సమకూర్చాలని పలువురు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
మెదక్‌లోని మల్లం చెరువు, పిట్లం చెరువులో పలు వీధులకు చెందిన మురుగునీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువులు దుర్వాసన వెదజల్లడంతో పాటు గుర్రపు డెక్క పెరుగుతుంది. మున్సిపల్ అధికారులు మురుగునీరు చెరువుల్లో కలువకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.
– రాజు, ఇరిగేషన్ డిప్యూటీ డీఈ

చెరువుల చెంత.. సమస్యల చింత