
చిన్నారులకు వైద్య పరీక్షలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో...
● శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా
● పిల్లల మానసిక స్థితిపై తల్లికి 42 ప్రశ్నలు
● సమస్య ఉన్నట్లు తేలితే వైద్యం
● మూడునెలల పాటు కొనసాగనున్న చెకప్
మెదక్‌జోన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పాటు పూర్వ ప్రాఽథమిక విద్య నేర్చుకుంటున్న ఆరేళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు ప్రారంభించారు. కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలపై కూడా పరీక్షలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి చిన్నారుల తల్లులకు వైద్య సిబ్బంది 42 ప్రశ్నలు అడుగుతున్నారు. మూడు నెలల పాటు కొనసాగే వైద్య పరీక్షల్లో పిల్లలకు ఏదైనా లోపం ఉన్నట్లు తేలితే వెంటనే వైద్యం అందిస్తారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్‌వాడీ కేంద్రాల్లో 52,619 మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. కాగా వారికి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) ఆధ్వర్యంలో కంటిచూపుతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల పై వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారుల తల్లులకు 42 ప్రశ్నలు సంధిస్తూ మీ బాబు, లేదా పాప పాలుతాగడం, వినికిడి శబ్దం ఎలా ఉంది? ఆహారం ఏవిధంగా తీసుకుంటున్నాడు? కారణం లేకుండా ఏడ్వటం, ఫిట్స్, ఆకస్మిక కదలికలు, సృహతప్పటం, ఇతరపిల్లలతో పోల్చితే ముఖకవలికలు భిన్నంగా ఉన్నాయా? శారీరక వైకల్యం ఉందా? ఇలా మొత్తం పలు అంశాలపై తల్లులకు ప్రశ్నలు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్, మే, జూన్‌లో పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఎలాంటి లోపం ఉన్నా వెంటనే చికిత్స చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే పెద్దాసుపత్రికి రెఫర్‌చేసి చికిత్స అందించనున్నారు.
గతేడాది 741 మందికి ఎదుగుదల లోపం
గతేడాది జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో తీవ్ర, అతితీవ్రలోపం పోషణతో 741 మంది చిన్నారులను గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా గుడ్లు, బాలామృతాన్ని అందించారు. కాగా 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు సాధారణ పిల్లలకు నెలకు 16 గుడ్లతో పాటు బాలామృతాన్ని ఇస్తారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3నుంచి 6 ఏళ్ల పిల్లలకు రోజుకో గుడ్డుతో పాటు భోజనం వండి పెడతారు.
ఆర్‌బీఎస్‌కే చిన్నారులకు వరం!
ప్రతిఏటా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 64,933 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,155 మంది కంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి 2,858 మందికి కళ్లద్దాలను అందజేశారు. మిగతా 297 మంది తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, మరికొన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఎస్‌కే సిబ్బంది తెలిపారు.
మూడు నెలల్లో పూర్తి...
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటిచూపుతో పాటు శారీరక, మానసిక స్థితిపై వైద్య పరీక్షలను ఈనెల 7న, ప్రారంభించాం. మూడు నెలల్లో పూర్తి చేస్తాం. అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి వైద్యం అందిస్తాం.
– మాధురి, ప్రోగ్రాం ఆఫీసర్, ఆర్‌బీఎస్‌కే