
ద్రాక్ష.. ఏదీ రక్ష!
ఉమ్మడి జిల్లాలో సాగు కనుమరుగు!
● సొంత రాష్ట్రంలో అంతరిస్తున్న దుస్థితి ● పొరుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న ‘వైన్ టూరిజం’ ● సాగు పెంపుపై ఉద్యాన, హార్టికల్చర్ ప్రత్యేక కార్యాచరణ
తెలంగాణలో పుట్టిన ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రం జోరుగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ‘వైన్ టూరిజం’ పేరిట పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో తెలంగాణలో పూర్వవైభవానికి ఏం చేద్దాం..? అంటూ ఉద్యాన శాఖ, హార్టీల్చర్ యూనివర్సిటీలు సమష్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.
గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్‌పిల్‌లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలు తొలగించి ప్లాట్లుగా మార్చారు.
కనుమరుగు దశకు..
పదిహేనేళ్ల క్రితం రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఉన్న సాగు.. నేడు 400ఎకరాలకే పరిమితమయ్యింది. గతంలో వేలాది మంది రైతులుండగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 25మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో ద్రాక్ష కనుమరుగు దశకు చేరుకుంటోంది.
మహారాష్ట్ర, కర్నాటకల్లో వైన్ టూరిజం..
ప్రస్తుతం మన రాష్ట్ర అవసరాలకు మహారాష్ట్ర నుంచి ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వం రైతులకు విరివిగా సబ్సిడీలను అందిస్తుండటంతో సాగు క్రమంగా పెరుగుతోంది. మరో ముఖ్యమైన అంశమేమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ‘వైన్ టూరిజం’ ట్రెండ్ కొనసాగుతోంది. ద్రాక్ష తోటలు సాగుచేస్తున్న రైతులు.. తమ తోటలను ‘ఎకో టూరిజం’ ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తోట ల్లో ఎక్కువగా వైన్ వైరెటీగా చెప్పుకునే రేసిన్ రకం ద్రాక్షను సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తోటల్లోనే వైన్ ఉత్పత్తి యూనిట్లను సైతం ఏర్పాటుచేసి.. తమ తోటల్లో వచ్చే పర్యాటకులకు తక్కువ ధరకు వైన్ అందిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్‌కు వైన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. లిక్కర్‌లో అల్కాహాల్ శాతం 46శాతం వరకు ఉంటే వైన్‌లో కేవలం 8–10శాతం అల్కాహాల్ ఉండటం వల్ల ప్రత్యేకించి యువతతోపాటు అన్ని వయసుల వారు వైన్ సేవించడానికి మక్కువ చూపుతున్నారు. తమ కళ్లముంగిటే సహజమైన పద్ధతుల్లో వైన్ దొరుకుతుండటంతో దీనిని ఇష్టంగా సేవిస్తున్నారు.