
లబ్ధిదారులు అప్పుల పాలు కావొద్దు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
హవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకొని అప్పుల పాలు కావొద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న కొచ్చెరువు తండాలో ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారుల నిబంధనల మేరకు నిర్మించుకుంటే స్థలం సరిపోకుండా ఉందని, చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తే మిగితా డబ్బులు వేసి నిర్మించుకుంటామని లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చూడాలని ప్రజలకు సూచించారు. అనంతరం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, శ్రీనివాస్, తండా వాసులు శ్రీనునాయక్, రెడ్యా, అమ్రియా తదితరులు పాల్గొన్నారు.