
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
మెదక్ కలెక్టరేట్: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా, పోస్టాఫీస్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూ ర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేయాలని హితవుపలికారు. అనంతరం కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. అయితే కలెక్టర్, అదనపు కలెక్టర్ లేకుండా మహనీయుల జయంతి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. స్పందించిన డీఆర్‌ఓ భుజంగరావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ మాట్లాడుతూ.. కలెక్టర్ సీఎం సమావేశానికి హైదరాబాద్ వెళ్లగా, తల్లి అనారోగ్యం కారణంగా అదనపు కలెక్టర్ నగేష్ సెలవులో ఉన్నారని తెలిపారు. కార్యక్రమానికి ఎస్పీ వస్తున్నారని సముదాయించగా.. ఆందోళన విరమించారు. ఈసందర్భంగా వక్త లు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా నాయకులు పనిచేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత విద్యాభ్యాసం చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, వివిధ కులసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్